పశువుల ఆరోగ్య సంరక్షణే భాగ్యము
పశుపోషణలో వాటి ఆరోగ్య సంరక్షణ చాలా ముఖ్యం. "ఆరోగ్యమే మహాభాగ్యము" అనే సూక్తి మనకే కాదు పశువులకు కూడా వర్తిస్తుంది. అవి ఆరోగ్యంగా ఉంటేనే వాటి వాళ్ళ మనకు భాగ్యము కలుగుతుంది. పశువుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేస్తే వాటి ఉత్పత్తి తగ్గి, వ్యవసాయ పనులు కుంటు పడటం వల్ల మనకు ఎంతో నష్టం.
పశువులు ఆరోగ్యంగా వుండాలంటే
పశువులు ఆరోగ్యంగా వుండాలంటే
- పశువుల శాలలు, వాటి పరిసరాలు శుభ్రంగా వుండాలి.
- పుష్టికరమైన మేపు మేపాలి.
- పరిశుభ్రమైన నీరు ఎల్లప్పుడు అందుబాటులో వుండాలి.
- గోమార్లు, పిడుదులు, దోమలు నిర్మూలించాలి.
పశువుల ఆరోగ్య స్థితి పరిశీలన
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం, పాలు పితికేటప్పుడు మేత మేసేటప్పుడు, పశువుల పాకలో వాటి ప్రవర్తనను పరిశీలించాలి. వాటి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు గమనించి, వ్యాధులున్నట్లైతే ముందుగానే పసిగట్టి తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం.
ఆరోగ్యమైన పశువు లక్షణాలు
- తోక, చెవులు ఆడిస్తూ చురుకుగా వుంటుంది.
- మేత మేసి నెమరు వేస్తుంది, ముట్టె చెమ్మగా వుంటుంది.
- పాల ఉత్పత్తిలో మార్పు వుండదు.
- ఉష్ణోగ్రత ఆవులో 38.3oC నుండి 38.8oC, గేదెలో 37.8oC నుండి 39.3oC
- పేడ ఆకు పచ్చరంగులో వుండి అంత పలుచగాను లేదా మరి గట్టిగా వుండదు.
- మూత్రము వరిగడ్డి రంగులో వుంటుంది.
జబ్బు పశువు లక్షణాలు
- మందలోకలవక మందకొడిగా వుంటుంది.
- మేత నెమరు వేయదు.
- జ్వరం వుంటుంది.
- చర్మం మొద్దుబారి వెంట్రుకలు పైకి లేస్తాయి.
- కళ్ళ నుండి పుసి, నీరు కారుతుంది. చెవులు క్రిందికి జారి అలసిపోయినట్టుగా కనబడుతుంది.
- సాధారణంగా పాడి పశువు, పాలు పితికే ముందు దాని శరీరము, పొదుగును కడిగేటప్పుడు, మూత్ర విసర్జన చేసి సేపడానికి సిద్ధపడుతుంది. అలా కాకుండా, వెనుక కాళ్ళు జాడించి పొడుగు ముత్తగానే భయంతో ఆందోళన పడ్డట్లైతే కొద్ది సేపు దాన్ని వదిలివేయాలి. తర్వాత కూడా అలాగే ప్రవర్తిస్తే దానికి పొదుగు వాపు అని గుర్తించాలి.
- పాలు పితికేటప్పుడు దాణా తినకుండా నిలబడితే దాని జ్వరము పరిశీలించాలి లేదా అజీర్తిగా అనుమానించాలి.
- పశువు పేడ పెంటికలుగా వుంటే దానికి మలబద్ధకంగా గుర్తించాలి. మరీ పలుచగా వుంటే దానిని విరేచాలుగా గుర్తించాలి.
- ఆరోగ్యమైన పశువు వేసిన పేడకడి మధ్యలో గుంత ఏర్పడి గుండ్రంగా వుంటుంది. పేడకడిలో అక్కడక్కడ గుంతలున్నట్లయితే దాని కడుపు పులిసి అజీర్తికి దారి తీస్తుందని గమనించాలి.
- పేడలో జీర్ణము గాని మేత ముక్కలు కన్పిస్తే జీర్ణశక్తి లోపంగా గుర్తించాలి. పేడమీద చీము గాని,
- తెల్లసొన గాని కన్పించినట్లయితే జీర్ణకోశ వ్యాధులున్నట్లు గమనించాలి.
- పశువులో జబ్బు లక్షణాలు కన్పించిన వెంటనే డాక్టరును సంప్రదించి తగిన చికిత్స చేయించాలి.
పశువుల అంటువ్యాధులు
సూక్ష్మజీవులు ప్రవేశించడంవల్ల వ్యాధి కలిగి గాలి ద్వారా, నీటి ద్వారా,
మలమూత్రాల ద్వారా యితరత్రా ఒక పశువు నుండి యింకొక పశువుకు
సోకేవి అంటువ్యాధులు. కారణాలను బట్టి యివి మూడు రకాలు.
1.సూక్ష్మాతి సూక్ష్మజీవులు (వైరస్) వల్ల కలిగే వ్యాధులు i) గాలికుంటు ii) పెద్దరోగము
iii) మశూచి మొదలగునవి.
2.సూక్ష్మజీవులు (బాక్టీరియా) వల్ల కలిగే వ్యాధులు i) గురక రోగము లేదా గొంతువాపు
ii) జబ్బు వాపు, iii) దొమ్మ
3.పరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధులు i) నర్రా ii) థైలీరియా iii) జలగవ్యాధి
iv) నట్టలు, గోమారీలు, పిడుదులు యితర క్రిమికీటకాల బెడద.
ముఖ్యమైన అంటువ్యాధులు
గొంతువాపు
- జ్వరంతో కళ్ళు ఎర్రబడి నీరు కారును
- ఆయాసంతో శ్వాస పీల్చడం వల్ల గుర్రుమని శబ్దం
- దవడల మధ్య మెడ క్రింద వాపు
- శ్వాస మరీ కష్టమై నాలుక బయటికి తీస్తుంది
- వ్యాధి అతి తీవ్రంగా వున్నప్పుడు జ్వరం ఎక్కువై, శ్వాస కష్టమై హఠాత్తుగా పశువు చనిపోవచ్చు.
మొదట్లో చికిత్స చేస్తే బ్రతికే అవకాశముంది.
జబ్బవాపు
- బలిష్టంగా వుండి వయస్సు మీద పశువులకు వ్యాధి వస్తుంది.
- జ్వరంతో కళ్ళు ఎర్రబడతాయి.
- జబ్బ, తుంటి కండరాలలో వాపు
- పశువు కుంటుతూ కూలబఢిపోతుంది.
- వ్యాధి ముదిరితే 1-2 రోజులలో పశువు చనిపోతుంది.
- ప్రారంభదశలోనే చికిత్స చేస్తే బ్రతుకుతుంది.
పెద్ద రోగము
- జ్వరతీవ్రత 104-107o ఫారన్ హీటు
- కళ్ళు ఎర్రబడి నీరు కారడం
- నోటి నుండి దుర్వాసన
- చిగుళ్ళ మీద నాలుక మీద పొక్కులు
- జిగురు, రక్తంతో కూడిన విరేచనాలు
- గొట్టం చిమ్మినట్లుగా పారుకొని నీరసించి చనిపోతుంది.
మొదట్లోఆంటిబయాటిక్మందులతో చికిత్స చేస్తే కొంతవరకు ఫలితం.
గాలికుంటు వ్యాధి
- జ్వరతీవ్రత 104-105oఫారన్ హీటు
- నోటిలో పొక్కులు, చొంగ
కారుతుంది. మేత మేయదు. - గిత్తల మధ్య పొక్కులు ఏర్పడి కుంటుతుంది.
- సంకర జాతి పశువులలో వ్యాధి తీవ్రత ఎక్కువ.
అపాయం అంతగా లేకపోయినా ఆర్ధికంగా నష్టదాయకం.
ఆంటిబయాటిక్ మందులతో చికిత్స, పుండ్లకుమలాం రాయాలి.
ఆంటిబయాటిక్ మందులతో చికిత్స, పుండ్లకుమలాం రాయాలి.
అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు
ప్రతిరోజు తనిఖీ చేసి వ్యాధి సోకిన పశువులను వేరు చేయాలి. అంటువ్యాధి సోకిన సమాచారం వెంటనే డాక్టరుకు తెలియజేయాలి
వ్యాధి పశువు యొక్క పాత్రలు, గొలుసులు క్రిమి సంహారక ద్రావకంతో కడగాలి
పశువుల శాలలు శుభ్రం చేసి క్రిమి సంహారక ద్రావకంతో కడగాలి
పశువుల శాలలను పరిశుభ్రంగా ఉంచాలి
వ్యాధి పశువు తినగా మిగిలిన గడ్డి గాదం తీసి కాల్చి వేయాలి
వ్యాధితో చనిపోయిన పశు కళేబరాన్ని గోతిలో సున్నము చల్లి పూడ్చాలి
అంటురోగ నిరోధక టీకాల కార్యక్రమము
అంటువ్యాధులు సోకిన తర్వాత చికిత్స వల్ల అంతగా ప్రయోజనం వుండదు. అవి కోలుకున్నా వాటి ఉత్పాదన శక్తి తగ్గిపోతుంది. వ్యాధులు వచ్చిన తర్వాత బాధపడడం కన్నా, ముందుగానే సరియైన సమయంలో రోగ నిరోధక టీకాలు వేయించాలి.
చికిత్స కన్నా నివారణ మేలు
పశువులలో అంటు వ్యాధుల నిరోధక టీకాల కార్యక్రమము
వ్యాధి పేరు
|
మొట్టమొదట చేయించవలసిన వయస్సు
|
ఆతర్వాత టీకాలు వేయడం
|
చేయించవలసినసమయం
|
1. గాలికుంటు
|
రెండునెలల వయస్సులో
|
సం.రానికిరెండు సార్లు
|
మార్చి -ఏప్రిల్
ఆగస్టు -సెప్టెంబరు
|
2. పెద్ద రోగము
|
6వ నెల వయస్సు
|
ప్రతి సం.రానికిఒక సారి
|
జనవరి -ఫిబ్రవరి
|
3. గొంతు వాపు
|
5వ నెల
|
ప్రతి సం.రానికిఒక సారి
|
మే - జూన్
|
4. జబ్బ వాపు
|
7వ నెల
|
ప్రతి సం.రానికిఒక సారి
|
మే - జూన్
|
5. దొమ్మ రోగము
|
6వ నెల
|
ప్రతి సం.రానికిఒక సారి
|
ఆగస్టు -సెప్టెంబరు
|
6. ఈసుడురోగము
|
4-6 నెలలో
|
జీవితంలోఒకేసారి
|
ఎప్పుడైనా
|
7. థైలేరియాసిస్
|
నాలుగునెలల తర్వాత
|
ప్రతి సం.రానికిఒక సారి
|
ఎప్పుడైనా
|
పాడి పరిశ్రమ నిర్వహణకు చేయూత
గ్రామీణ ప్రాంతాలలోని పేదవారి ఆర్ధిక పరిస్థితి పాడి పశువుల పోషణ ద్వారా అభివృద్ధి పరచాలన్నధ్యేయంతో, పాడి పశువుల పోషణకు, ప్రభుత్వంతోపాటు, గ్రామీణాభివృద్ధి సంస్థలు, బ్యాంకులు, హరిజన గిరిజనాభివృద్ధి సంస్థలు, పాల ఉత్పత్తి దారుల సహకార సంఘాలు అనేక పధకాలను అమలు చేస్తున్నాయి.
సబ్సిడీపై పాడి పశువుల యూనిట్ల పంపిణీ
గ్రామీణాభివృద్ధి సంస్థ, వెనుకబడిన కులాలు మరియు హరిజనాభివృద్ధి సంస్థల ద్వారా గ్రామాలలోని బలహీన వర్గాల వారికి, పేద రైతులకు సబ్సిడీపై పాడి పశువుల యూనిట్ల పంపిణీ చేస్తున్నారు. సంకర జాతి ఆవులను గాని రోజుకు 6 లీటర్ల పాలు యిచ్చే ఒక జత గేదెలను గాని ప్రతి లబ్ది దారుకు యివ్వడం జరుగుతుంది. ఒక గేదెల యూనిట్ ధర రూ. 14000 . యిందులో 25 శాతం సబ్సిడీ సన్నకారు చిన్నతరహా రైతులకు 33.3 శాతం సబ్సిడీ రైతు కూలీలకు మరియు హరిజనులకు 50 శాతం సబ్సిడీ యివ్వబడుచున్నది.
దూడల పెంపకానికి ప్రోత్సాహం
సంకరజాతి దూడల, గ్రేడెడ్ ముర్రా జాతి గేదె దూడల పోషణను ప్రోత్సహించడానికి ఈ సంస్థల ద్వారా దూడల కొరకు ప్రత్యేక దాణా సరఫరా చేయడం జరుగుచున్నది. ఈ దాణా మేపడం వల్ల దూడలు త్వరగా పెరిగి మంచి పాడి పశువులుగా వృద్ధి చెందుతాయి.
సంకరజాతి పెయ్య దూడల మేపు ఖర్చు కోసం అంటే 4 నెలల నుంచి అది ఈనే వరకు సుమారు 19-20 క్వింటాళ్ళ దాణా కావాలి. యిందుకొరకు 2400 రూపాయల ఖర్చవుతుంది. అదే గేదె దూడ మేపు కోసం 6 వ మాసం నుండి ఈనే వరకు రూ. 2100 ఖర్చవుతుంది.
యిందులో సన్నకారు చిన్న తరహా రైతుల కొరకు 50 శాతం, వ్యవసాయ కూలీలకు 66.3 శాతం సబ్సిడీ యివ్వడం జరుగుతుంది. స్వంత దూడలు వున్న వారికే సబ్సిడీని దాణా రూపంలో యివ్వడం జరుగుతుంది.
బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం
పాడి పశువుల కొనుగోలుకు కావలసిన మొత్తంలో సబ్సిడీ పోగా మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించబడుతుంది. గ్రామీణాభివృద్ధి మరియు యితర సంస్థల నుంచి సబ్సిడీ బాగం బ్యాంకుకు చేరగానే, కొనుగోలుకు కావలసిన మొత్తాన్ని బ్యాంకులు అందజేస్తాయి. తీసుకున్న అప్పును 5 సంవత్సరాల కాలంలో నెలసరి వాయిదాలలో చెల్లించవలసి వుంటుంది.
పశు సంవర్ధక శాఖ ద్వారా సాంకేతిక వనరులు సమకూర్చడం
పాడి పశువుల ఆరోగ్య సంరక్షణతో పాటు వాటి ఉత్పత్తి శక్తిని పెంచడానికి అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. పశువుల చికిత్స, టీకా మందుల సరఫరా, నట్టల నివారణ, గొడ్డు మోతు పశువుల చికిత్స శిబిరాల ఏర్పాటు పశుగ్రాసాభివృద్ధి, విత్తనాల సరఫరా, కృత్రిమ గర్భోత్పత్తి, శిక్షణ వంటి సదుపాయాలూ పశు సంవర్ధక శాఖచే కల్పించబడుచున్నవి. ఈ సదుపాయాలు, పాల ఉత్పత్తి సహకార సంఘాల ద్వారా, ఆయా సంఘాల సభ్యులకు మాత్రమే కల్పించడం జరుగుచున్నది.
పశువులకు భీమా సౌకర్యము
పశువులు వ్యాధుల వల్ల గాని, ప్రమాదాల వల్ల గాని చనిపోయినట్లైతే వాటి స్థానే పశువులను కొనడానికి రైతులకు పశువుల భీమా పథకము ఉపయోగపడుతుంది. భీమా పథకము 2-10 సంవత్సరాలలోపు పాడి ఆవులకు, 3-12 సంవత్సరాలలోపు పాడి గేదెలకు, ఆబోతులకు, మరియు పని ఎద్దులకు వర్తిస్తుంది. ఈ పథకము పశువుల ఉత్పత్తి యోగ్యమైన జీవిత కాలము వరకు వర్తిస్తుంది.
సన్నకారు రైతులకు, చిన్న తరహా రైతులు, రైతు కూలీలు యితర బడుగు వర్గాల సంక్షేమ పథకాల క్రింద లబ్ధిదారులకు పశువుల భీమా సౌకర్యాలు కల్పించబడుచున్నవి. వీరికి, ప్రత్యేక ప్రీమియం రేటు 2.25 శాతం మాత్రమే. జాతీయ పాడి అభివృద్ధి సంస్థ మార్గదర్శకంలో నిర్వహిస్తున్న డైరీ ఫారాల పశువులకు కూడా ప్రీమియం రేటు 2.85 శాతం మాత్రమే. యితర రైతుల పశువులకు ప్రీమియం రేటు 4 శాతం వసూలు చేయబడును.
భీమా చెల్లింపు : పశువుల భీమా బహుళ జనాధరణ పొందిన దృష్ట్యా చెల్లింపు ఆలస్యం లేకుండా సకాలంలో లబ్దిదారులు చెల్లింపులు పొందడానికి చెల్లింపు విధానాన్ని సరళతరంగా రూపొందించడం జరిగినది. అన్ని కంపెనీలకు ఒకేమాదిరి చెల్లింపు పత్రము రూపొందించడం జరిగింది. పశువు మరణ సమాచారం రైతు ఋణము పొందిన బ్యాంకుకుగాని, ఇన్సూరెన్స్ కంపెనీకిగాని, గ్రామీణాభివృద్ధి సంస్థవారికి గాని, 30 రోజుల లోపల మరణ ధృవీకరణ పత్రము క్లెయిము పత్రముతో జతపరచి తెలియపరచాలి.
పశువు మరణాన్ని ధృవీకరిస్తూ ధృవీకరణ పత్రము ఈ క్రింద పేర్కొన్న వారి నుండి పొందవచ్చు.
పశువు మరణాన్ని ధృవీకరిస్తూ ధృవీకరణ పత్రము ఈ క్రింద పేర్కొన్న వారి నుండి పొందవచ్చు.
1 . గ్రామ సర్పంచు, 2 . గ్రామ సహకార సంఘం అధ్యక్షులు, 3 . పాల సేకరణ కేంద్రం అధికారి, 4 . స్థానిక పశు వైద్య అధికారి, 5 . కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు సూపర్వైజర్ లేదా ఇన్ స్పెక్టర్ లేదా, 6 . గ్రామీణాభివృద్ధి సంస్థ చేత అధికారం పొందిన వ్యక్తి, 7 . స్థానిక పశువైద్య అధికారి.
ఉద్దేశ్య పూర్వకముగా చంపినపుడు, భీమా అమలులోకి రాక ముందే పశువు వ్యాధి గ్రస్తమైనపుడు పశువు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేసినపుడు భీమా సౌకర్యం వర్తించదు.
No comments:
Post a Comment