పశువులలో ప్రధమ చికిత్స
పశువులకు గాయాలు కలగడం, కొమ్మలు విరగడం సర్వ సాధారణం. అంతేకాకుండా సామాన్యంగా మేత ఎక్కువగా తిన్నప్పుడు, కుప్ప నూర్పుడు చేసేటప్పుడు గింజలు తినడం వల్ల కడుపు కుట్టు, కడుపు ఉబ్బడం జరుగుతుంది. ఈ వ్యాధులకు వెంటనే చికిత్స చేయించడం మంచిది లేదా ప్రమాదం. మనకు పశువైద్యం అందుబాటులో లేనప్పుడు మరింకే పరిస్థితులలో వైద్య సహాయం అందలేని స్థితిలో వ్యాధి తీవ్రతరం కాకుండా కొన్ని ప్రధమ చికిత్స చర్యలు పాటించాలి.
గాయాలు
- గాయాలను పొటాషియం పర్మంగానేటు కాని, ఫినాయల్ ద్రావకంతో కాని, శుభ్రం చేయాలి. మరగబెట్టి ఉప్పు నీటితో చీము పట్టిన పుండ్లను శుభ్రం చేయవచ్చు.
- రక్తం కారుతున్నప్పుడు గాయానికి పైగా బిగ్గరగా కట్టుకడితే రక్తం ఆగుతుంది. శుభ్రమైన దూది అందులో దూర్చి రక్తం కారకుండా చూడాలి. కొంచెం సల్ఫనిలమైడ్ పౌడరు వేసి కట్టుకట్టాలి.
- పురుగులు పట్టిన గాయాలకు పురుగులు తీసివేసి కర్పూర తైలం పోయాలి. లేదా సీతాఫలము ఆకు, పసుపు నూరి పురుగుపట్టిన పుండ్లకు రాసినట్లైతే పురుగులు చనిపోయి త్వరగా మానును. ఈగలు వ్రాలకుండ వేపనూనె రాయాలి.
కాడి పుండు
బండ్లు, నాగలి లాగే పశువులలో సరియైన జోడు లేకపోయినప్పుడు, రాపిడి వల్ల కాడి పుండు కలుగుతుంది.
- కాడి మోపిన చోట వెంట్రుకలు రాలిపోయి, కమిలి నొప్పి పెడుతుంది. ఈ ప్రదేశంలో రోజు కొంతసేపు చల్లనీటి ధారపోయాలి.
- కొబ్బరి నూనెలో హారతి కర్పూరం కలిపి దాని మీద పోయాలి.
- కమిలిన భాగం పెద్దగా వాచినట్లైతే అయోడిన్ ఆయింటుమెంటు పూయాలి. లేదా ఆవపిండి పలస్త్రీని వాపుమీద వేయాలి. అది పగిలి కారుతుంది. తరువాత మాములుగా గాయాలకు చేసినట్లు చికిత్స చేయాలి. వాపు తగ్గే వరకు పని చేయించకూడదు.
కొమ్ములు విరగడం
- వ్రేలాడుతున్న కొమ్మును కోసివేయాలి.
- రక్తం కారకుండా తెల్లని గుడ్డను తడిపి గట్టిగా కట్టుకట్టాలి. కట్టు కట్టక ముందు గాయం మీద కొంచెం పాటిక పొడి చల్లాలి.
- కొమ్ము తుడుగు ఊడితే తెల్లని గుడ్డ పీలికలు, తడిపి మందంగా గట్టిగా కట్టు కట్టాలి. కట్టు మీద పటిక నీరు పోయాలి. తర్వాత డాక్టరుతో చికిత్స చేయించుకోవాలి.
బెణుకులు
- బెణికినచోట వేడినీళ్ళతో రోజుకు రెండు మూడు సార్లు కాపాలి.
- ఆ తర్వాత నూనెలో హారతి కర్పూరము కలిపి మర్దన చేయాలి. చింతాకు కషాయంతో కూడా కాపవచ్చు.
- కట్టుకట్టుటకు వీలుగా వుంటే చింతాకు నూరి కట్టుకట్టాలి. బెణుకు పాతబడితే ఆవపిండి జిగురు పూయవచ్చు, పని మాన్పించాలి.
కీళ్ళు తొలగుట
- కీలు తొలగిన వైపు కాక రెండవ వైపు పశువును పడవేసి, కీలు తొలగిన వైపుకు తాడుకట్టి జాగ్రత్తగా లాగుతూ, మరొకరు అరచేతిలో తొలగిన కీలును యధాస్థానమందు పడేటట్లు చూడాలి.
- కీలు సర్దుకున్న తర్వాత మూడు భాగాలు ఆవపిండి ఒక భాగం కారంపొడి కలిపి నూరి బాగా ఎర్రబడేటట్లు రుద్దాలి. పశువులకు విశ్రాంతి నివ్వాలి. యింకా నయం కాకపోతే డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలి.
కడుపు కుట్టు
పశువులు మేత బాగా తిని తగినన్ని నీరు త్రాగకపోవడంవల్ల లేదా గింజలు ఎక్కువగా తినడంవల్ల జీర్ణకోశం సరిగా పని చేయక కడుపు కుట్టు వస్తుంది.
పశువు నెమరు వేయటం మానుకుంటుంది. పేడ పెంటికలుగా వేస్తుంది. పశువులు మందకొడిగా వుంటాయి. ఎడమ డొక్కలో సొట్టపడుతుంది. కడుపునొప్పితో బాధపడతాయి.
- రెండు లీటర్ల నీళ్ళలో 50 గ్రాములు ఉప్పు 50 గ్రాములు సొంఠి పొడి కలిపి త్రాగించాలి.
- ఒక రోజులో తగ్గకపోతే పావుశేరు ఆముదము పట్టించాలి. దాణా పెట్టకూడదు.
- కొంచెం నెమరు వేసి పేడవేయగానే 20 గ్రాములు ముష్టి గింజలపొడి 30 గ్రాములు సొంటిపొడి 20 గ్రాముల సోడా ఉప్పు బెల్లంలో కలిపి 3 - 4 రోజులు వరుసగా తినిపించాలి. కడుపు కుట్టు రెండు రోజులలో నయం కానట్లయితే డాక్టరు గారిచే వైద్యం చేయించాలి.
కడుపు ఉబ్బు
- 50 గ్రాముల కర్పూర తైలము అర్ధ లీటరు నూనెలో కలిపి త్రాగించాలి.
- ఇంకా తగ్గకపోతే 25 గ్రాముల మిరియాపొడి 25 గ్రాముల సొంఠి పొడి 150 గ్రాముల నాటుసారా, 1 లీటరు నీళ్ళలో కలిపి త్రాగించాలి.
- కడుపు ఉబ్బు తగ్గే వరకు మేత వేయకూడదు. జావగాని, గంజికాని త్రాగించాలి.
- ఆ తర్వాత 20 గ్రాముల సో౦పు పొడి 20 గ్రాముల సొంఠి పొడి 20 గ్రాముల ముష్టి విత్తుల పొడి 20 గ్రాముల వాముపొడి 40 గ్రాముల సోడా ఉప్పు బెల్లంలో కలిపి ముద్ద చేసి తినిపించాలి.
సామాన్య పారుడు
- ఆ తర్వాత 20 గ్రాముల కాచు 20 గ్రాముల సీమ సున్నము 20 గ్రాముల సొంఠి పొడి జావలో కలిపి త్రాగించాలి. ఇంకా పారుడు కట్టకపోతే డాక్టరు చేత వైద్యం చేయించాలి.
No comments:
Post a Comment