Friday, 26 June 2015

పశుగ్రాసాల సాగు

పాడికి ఆధారం పచ్చి మేత " పచ్చి మేత లేనిది పాడి లాభసాటి కాదు.
  • పచ్చి మేత లేనిది పాడి లాభసాటి కాదు. కేవలం వరిగడ్డి, చొప్ప మీద ఆధారపడి పాదిపశువులను పోషించితే ప్రయోజనం లేదు.
  • పాడి నిర్వహించే ప్రతి రైతు తనకున్న భూమిలో పదవ వంతు పచ్చి మేతల సాగుకు వినియోగించాలి. పచ్చిమేతలను, యితర పంటల సాళ్ళ మధ్య పండ్ల తోటల లోను సాగు చేసుకోవాలి.
  • పచ్చిమేత మేపిన పశువులు, సకాలంలో ఎదకు సకాలంలో ఎదకు వచ్చి చూలు కట్టి ఈనుతాయి. పాల ఉత్పత్తి పెరిగి, ఉత్పత్తి ఖర్చులు తగ్గి పాడి పంట లాభసాటిగా వుంటుంది.
  • ఒక ఎకరంలో పండించే పచ్చిమేతలో5-6 మంచి పాడి పశువులను పోషించుకొని సుమారు 30వేల రూపాయల ఆదాయం పొందవచ్చు. అదే ఎకరంలో యితర పంటలు పండిస్తే 13-15 వేల రూపాయల ఆదాయం లభిస్తుంది.
  • రోజుకు ఒక పశువుకు పూర్తిగా పచ్చిమేత మేపితే 30-40 కిలోలు కావాలి. అంటే సం.రానికి 11-14 టన్నుల మేత కావాలి. నీటి వసతి గల భూమిలో ఎకరానికి 5-6 పశువులను పోషించవచ్చు. వర్షాధార భూమిలో 2-3 పశువులను పోషించవచ్చు.
పశుగ్రాసాల రకాలు
  1. ధాన్యపు జాతి రకములు : ఏకవార్షికములు : యం. పి. చారి, స్వీట్ సూడాన్ గడ్డి, జొన్న, పూసాచెరి, మొక్కజొన్న, యవ్వలు మొ||నవి. బహువార్షికములు: నేపియర్, యన్.బి.21, పారాగడ్డి, గినీ గడ్డి మొదలగునవి.
  2. కాయ జాతి రకములు: ఏకవార్షికములు : అలసంద, లూసర్ను, బర్సీము, గోరు చిక్కుడు, జనుము, పిల్లి పెసర మొదలగునవి. బహువార్షికములు : స్టైలోహెమట, స్టైలో స్కాబ్రా మొదలగునవి.
మిశ్రమ పద్దతిలో పశుగ్రాసాల సాగు
రైతులు తమకున్న భూమిలో, పచ్చిమేత అవసరాలను దృష్టిలో వుంచుకొని కొంత భూమిని ప్రత్యేకంగా పచ్చిమేతలు సాగుచేసుకొని పాడి పశువులను మేపుకొన్నట్లయితే లాభదాయకంగా వుంటుంది. నీటి పారుదల క్రింద భూమిని పశుగ్రాసాల సాగుకు వినియోగించినప్పుడు ఈ క్రింద పట్టికలో చూపిన విధంగా పశు గ్రాసాలను, పంటల మార్పిడి లేదా మిశ్రమ పంటలుగా రైతులు ఆయా కాలానుసారంగా వనరులను బట్టి సాగు చేసుకొన్నట్లయితే సంవత్సరము పొడుగునా పశువులకు పచ్చిమేత మేపుకోవచ్చు.
ఖరీఫ్
రబీ
వేసవి
1.హైబ్రిడ్ నేపియర్
అలసంద (చాళ్ళ మధ్య)
లూసర్ను (చాళ్ళ మధ్య)
2.సజ్జ + అలసంద
లూసర్ను
లూసర్ను
3.మొక్కజొన్న + అలసంద
లూసర్ను
లూసర్ను
4. జొన్న+ అలసంద
మొక్కజొన్న + అలసంద
జొన్న+ అలసంద
5. మొక్కజొన్న + అలసంద
యవ్వలు + బర్సీము + లూసర్ను
లూసర్ను
పచ్చిక బీళ్ళలో మేలు జాతి గడ్డి రకాలు
పచ్చిక బీళ్ళలో, మేలుజాతి రకాలు గురించి తెలుసుకుందాం. సాధారణంగా పచ్చి బీళ్ళలో, చెంగలి గడ్డి, మొలవ గడ్డి, సేంద్ర గడ్డి ఎక్కువగా ఉన్నాయి. ఈ రకాలు నెమ్మదిగా పెరుగుతాయి. దిగుబడి తక్కువ, ఒకసారి పశువులు మేస్తే తిరిగి పెరగడానికి చాలా కాలం పడుతుంది. పచ్చిక బీళ్ళకు పనికి వచ్చే గడ్డి ఈ క్రింది లక్షణాలు కలిగి వుండాలి.
  1. తక్కువ వర్షపాతానికి త్వరగా ఎదిగి ఎక్కువ దిగుబడి నివ్వాలి.
  2. ఎండాకాలంలో కూడా చనిపోకుండా తేమ తగలగానే తిరిగి త్వరగా పెరగాలి.
  3. పశువులు మేసినందువల్ల గడ్డి దెబ్బ తినకుండా త్వరగా పెరగాలి.
  4. మంచి ఆహారపు విలువ కలిగి రుచికరంగా వుండాలి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని పచ్చిక బయళ్ళకు ఉపయోగపడు కొన్ని మంచి రకాలు వృద్ధి చేయబడ్డాయి. వీటిలో
    • అంజనగడ్డి
    • చిన్న గినిగడ్డి,
    • రోడ్స్ గడ్డి,
    • కూసా గడ్డి,
    • దీనా నాధ్ గడ్డి,
    • సిరాట్రా,
    • గ్లైసీడియా,
    • లోసాంథెస్ మొదలగునవి మేలుజాతి రకాలు.
ఈ మేలు జాతి రకాలు విత్తనాలు చల్లి పచ్చిక బీళ్ళను అభివృద్ది చేసుకోవచ్చు. విత్తనాలు చల్లి సంవత్సరము మేపకుండా పూర్తిగా వదిలి వేయాలి.
పశుగ్రాసనికి ఉపయోగపడు చెట్లు
సుబాబుల్, అవిశ, నల్లతుమ్మ, దిరిశెన, రావి వంటి చెట్ల ఆకులు, పశుగ్రాసానికి బాగా ఉపయోగపడును. మేత కొరత సమయాల్లో వీటి ఆకులను పచ్చి మేతగా ఉపయోగించుకోవచ్చును.
పచ్చిమేత కొరత వున్నా సమయాలల్లో వరిగడ్డి చొప్ప మొదలగు ఎండుమేతలలో ఈ చెట్ల ఆకులు 20 - 30 శాతం వరకు కలిపి మేపితే పాల దిగుబడి తగ్గదు, పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. 
ఇలాంటి చెట్లను పెరట్లోనూ, తోటల చుట్టూ పొలంగట్లపైన సేద్యమునకు ఉపయోగపడని ఎట్టు పల్లాలలోను, ఖాళీ ప్రదేశంలోను వర్షాకాలములో నాటుకొని అభివృద్ధి పరచుకోవాలి.
పచ్చి మేత గడ్డి రకాల సాగు వివరములు
సాగు వివరములు
నేపియర్
పారగడ్డి
గినీగడ్డి
రకములు
యన్. బి. 21 
బి.యన్.2 
కో-1 , కొ2
ఇ.జి.యఫ్.ఆర్.ఐ-6, 10
హమిల్, మాకుని, రివర్స్ డేల్, గ్రీన్ పానిక్, గాటన్ పానిక్, పి.పి. జి. 14
విత్తు సమయము
ఫిబ్రవరి - ఆగష్టు నెలల మధ్యలో, చలికాలంలో తప్ప
జూన్ - జూలై దక్షిణ భారతంలో ఎప్పుడైనా
ఫిబ్రవరి - ఆగష్టు మధ్యలో, చలికాలంలో తప్ప
హెక్టారుకు కావలసిన నారు మొక్కలు
22 -30 వేల కాండపు మొక్కలు, ఒకసారి నాటితే 3 -4 సం.లుంటుంది
8 -10 క్వింటాళ్ళ బరువు గల కాండపు ముక్కలు, లేదా 30,000 నారు మొక్కలు
30 - 40 వేల నారు మొక్కలు
నాటు పద్ధతి
వరుసలలో, వరుసల మధ్య అంతరము 50 -75 సెం. మీ.
వరుసలలో, వరుసల మధ్య అంతరము 45 -60 సెం. మీ.
వరుసలలో, చాళ్ళ మధ్య అంతరము 45 -60 సెం. మీ.

సాగువివరములు
మేత జొన్న
మొక్కజొన్న
స్వీట్సూడాన్ గడ్డి
రకములు
PC-6, PC-23, S-194
M;P. CHARI
IS-4776 HC-136
ఆఫ్రికన్ టాల్, గంగ, HGT-3, జవార్, మోతి కాంపోజిట్
S.S.G.59-3
విత్తు సమయము
వర్షాధారంగా జూన్ - ఆగష్టు, నీటి పారుదల క్రింద జనవరి - మే
వర్షాధారంగా జూన్ - ఆగష్టు, నీటి పారుదల క్రింద జనవరి - మే
వర్షాధారంగా జూన్ - ఆగష్టు, నీటి పారుదల క్రింద జనవరి - మే
విత్తనాలు హెక్టారుకు
25-40 కిలోలు
50-60 కిలోలు
15 కిలోలు
విత్తు పద్ధతి
సాళ్లలో, సాళ్ల మధ్య 30 సెం.మీ. అంతరము
సాళ్లలో, సాళ్ల మధ్య 30 సెం.మీ. అంతరము
సాళ్లలో, సాళ్ల మధ్య 30సెం.మీ. అంతరము
ఎరువులు హెక్టారుకు
80కిలోల నత్రజని 
30 కిలోల పొటాష్
120 కిలోల నత్రజని 
120 కిలోల పొటాష్
80 కిలోల నత్రజని 
30 కిలోల పొటాష్
నీటి తడుపు
10-15 రోజుల కొకసారి
7-10 రోజుల కొకసారి
15-20 రోజుల కొకసారి
మొదటి కోత సమయము
50-55 రోజు లకు
(50 శాతం పూతలో)
60-70 రోజులలో
కంకి వేసే సమయంలో
55-60 రోజులు
కోతలు
3 కోతలు - ప్రతి 35-40 రోజులకొక కోత ఒక కోత
ఒకే కోత 60-70 రోజులకు
4-5 కోతలు, ప్రతి 30-35 రోజులకొకటి
దిగుబడి హెక్టారుకు
పచ్చిమేత 40-50 టన్నులు
పచ్చిమేత 40-50 టన్నులు
పచ్చిమేత 40-50 టన్నులు

సాగువివరములు
అలసందలు
లూసర్ను
స్టైలో
రకములు
UPC 287, EC 4216
NP3 UPC, 5286, UPC
రష్యన్ జెయింట్
T-9, ఆనంద్ -2
S-244, Comp-3
CO-I
స్టైలో హమట స్టైలో హామిలిస్ స్టైలో స్కాబ్రా
విత్తు కాలము
జూన్ - జూలై ఫిబ్రవరి - జూన్ (నీటి పారుదల క్రింద)
అక్టోబర్ - నవంబర్
జూన్ - ఆగష్టు, (నీటి పారుదల క్రింద)
కావలసిన విత్తనాలు హెక్టారుకు
30-40 కిలోలు

స్టైలో హమట 20-25 కిలోలు
స్టైలో స్కాబ్రా మరియు యితర రకాలు
10-15 కిలోలు
విత్తు పద్ధతి
వరుసలలో, వరుసల మధ్య ఎడం 45 సెం.మీ
సాళ్లలో, సాళ్ల మధ్య 20-25 సెం.మీ. అంతరము
చల్లాలి
ఎరువులు హెక్టారుకు
20 కిలోల నత్రజని 
60 కిలోల పొటాష్
30 కిలోల నత్రజని 
100 కిలోల పొటాష్
35 కిలోల నత్రజని 
60 కిలోల పొటాష్

పశుగ్రాసము వినియోగము, నిల్వ పద్ధతులు

మేత ముక్కలుగా నరికి మేపాలి
జొన్న, సజ్జ, మొక్కజొన్న లాంటి మేతల కాండములు పెద్దగా లావుగా ఉండుట వలన వాటిని చిన్న ముక్కలుగా నరికి మేపాలి లేని యెడల, మెత్తని భాగము ఆకులు మాత్రమే తిని మిగతాది తొక్కి మల మూత్రాలతో కలిసి 40 శాతం వరకు మేత వృధా అయిపోతుంది. ముక్కలుగా నరికిమేపడం వలన మేత పూర్తిగా సద్వినియోగం అవుతుంది. ముక్కలుగా నరికిన మేతలో, తవుడు, బెల్లపు మద్ది లవణ మిశ్రమము లాంటి అనుబంధ పదార్ధాలు కలిపి పశువులకు మేపుకోవచ్చు, సంచులలో వుంచి కూడా నిలువ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు తప్పని సరిగా పశుగ్రాసాన్ని ముక్కలు చేసి మేపాలి.
పశుగ్రాసము నిల్వ ఉంచే పద్ధతులు
పశుగ్రాసము పుష్కలంగా లభించే రోజులలో వృధా చేయకుండా నిల్వ చేసుకోవాలి. పశుగ్రాసము నిల్వ చేసుకోవడములో గమనించవలసిన విషయమేమిటంటే మేతలోని పోషక విలువలు సాధ్యమయినంతవరకు తగ్గకుండా చూసుకోవాలి. 
నిల్వ చేసే పద్ధతులలో రెండు పద్ధతులు కలవు.
  1. పచ్చి మేతను పాతర వేసుకోవడం.
  2. పశుగ్రాసాన్ని ఎండుమేతగా తయారు చేసుకోవడం.
ఎండు మేత నిల్వ చేసుకొనే పద్ధతి
పశుగ్రాసము కోసిన తర్వాత అందులోని తేమ సాధ్యమయినంత తక్కువ సమయంలో 35 శాతం వరకు తగ్గేటట్లు చూడాలి. ఆ తర్వాత మేతను నీడలో ఆరబెట్టి అందులోని తేమ 15 శాతం వరకు తగ్గించాలి. 15 శాతం తేమ ఉన్న పశుగ్రాసము బూజు పట్టకుండా చెడిపోకుండా నిల్వ చేసుకోవచ్చు. పోషక పదార్దములుకూడ ఎక్కువగా నష్టపోవు. 
ఎండు మేతగా నిల్వ చేసుకొనే పశుగ్రాసాన్ని, ఉదయం పూట సూర్యరశ్మి బాగా ఉన్నప్పుడు కోసి ఎండలో తల క్రిందులుగా నిలబెట్టాలి. ఆ తర్వాత అప్పుడప్పుడు మరలివేస్తుండాలి. దీనివల్ల మేతలోని 70 శాతం తేమ 40 శాతం వరకు తగ్గుతుంది. ఆ తర్వాత నీడలో పరిచి ఆరబెట్టి తేమ శాతము 15 శాతం వరకు తగ్గించాలి. ఇలా ఆరపెట్టేటప్పుడు మేతలోని ఆకులు ఎక్కువగా రాలిపోకుండా చూడడం చాల ముఖ్యం.
పాతర గడ్డి లేదా సైలేజీ చేయు పద్ధతి
సైలేజీ అనగా పశు గ్రాసమును ఎక్కువగా లభించు సమయములలో, మిగులు మేతను గుంతలలో పాతర వేసి నిలువ చేయుట, మొక్కజొన్న, జొన్న రకాల మేతలు పాతరవేయుటకు ఉపయుక్తమయిన రకములు, చెరుకు ఆకు, ఎన్.బి.21 గడ్డి, బి.ఎన్-2 గడ్డి, పేరా గడ్డి కూడా పనికి వస్తాయి. కాయజాతి పచ్చిమేతలు సైలేజి పాతర వేసుకోవడానికి పనికిరావు. పచ్చిమేత దొరకని సమయములో పచ్చిమేతకు బదులుగా వాడుకోవచ్చు.
సైలేజి రోజుకు పాడి పశువుకు 20 కిలోల చొప్పున యివ్వవచ్చును. సుమారు 120 రోజులకు సరిపడీ పాతర గడ్డి చేతిలో వుంటే వేసవి కాలపు పచ్చిమేత కొరత చాలా వరకు తగ్గిన్చుకోనవచ్చును. 5 పాడి పశువులకు 120 రోజులకు రోజుకు 20 కిలోల చొప్పున (5x12x120) 12000 కిలోల సైలేజి కావాలి. ఈ సైలేజి తయారు చేయడానికి 12000x3/2=18000 కిలోక పచ్చిమేత కావాలి. సుమారు ఒక ఎకరా భూమి నుండి లభించే జొన్న గాని, మొక్కజొన్న గాని అవసరముంటుంది.
15 టన్నుల సైలేజి చేసికొనుటకు పాతర పరిమాణము :
ఒక ఘనపుటడుగు సైలేజి బరువు 15 కిలోలు వుంటుంది. అంటే 1000 ఘనపుటడుగల పాతర కావాలి. 8 అడుగుల వెడల్పు 5 అడుగుల లోతు, 25 అడుగుల పొడవు గల పాతర సరిపోతుంది. సైలేజి పాతర తెరచిన తర్వాత 30 రోజులలో వాడుకోవాలి. కనుక దీనిని 3 భాగాలుగా చేసుకోవాలి. గుంత అడుగు భాగంలో ఏ పరిస్థితిలోను నీరు రాని ప్రదేశంలో గుంత తవ్వాలి.
పాతర నింపే విధానము :
పచ్చిమేతలో 70 - 80 శారత్ము నీరు వుంటుంది. సైలేజి చేయడానికి 60 శాతము మించి వుండకూడదు. కనుక కోసిన పచ్చిమేతను పొలంలోనే ఆరబెట్టి తేమను తగ్గించవచ్చును. ముక్కలుగా నరికితే మరి కొంత తొందరగా ఆరుతుంది. మరీ లేతగా ఉన్న పచ్చిమేత సైలేజి చేయడానికి పనికి రాదు. మొక్కజొన్న, సజ్జ రకాలను కంకిలో పాలు పట్టి గింజ గట్టిపద్తున్న సమయంలో పాతర వేస్త్రే కమ్మటి సైలేజి తయారు అవుతుంది. కొంత తవుడు గాని జొన్నపిండి, లేదా బెల్లపు మడ్డి రెండు శాతం వరకు పచ్చిమేతతో కలిపినా సైలేజి పులిసిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. తేమ మరీ తక్కువుగా వుంది ఎండ బెట్టిన పచ్చిమేతను పాతర వేస్తే పాతరలోగాలి, ప్రాణవాయువు ఎక్కువగా ఉందిపోయి బూజు పట్టవచ్చు. విపరీతమైన వేడి వాళ్ళ పాతర గడ్డి నిప్పు అంటుకొనే ప్రమాదం కూడా ఏర్పడుతుంది.
ఈ విషయాలు అన్ని గుర్తు వుంచుకొని పాతర వేయవలసిన గడ్డిని వరుసలలో నింపాలి. భూమిపైన కూడా 2 -3 అడుగులు వచ్చేలా నింపాలి. ప్రతి వరుసకు బాగా త్రొక్కి, గాలి ఏ మాత్రం లేకుండా చూడాలి. పశువులతోను లేదా ట్రాక్టరుతో కూడా త్రోక్కిన్చావచ్చును. మాలిన పదార్దములు గుంతలో పడకుండా చూడాలి. పాతరలలో పచ్చిమేత నింపుట పూర్తి అయిన తరువాత భూమి పైభాగాన ఎత్తుగా వచ్చేలా చూడాలి. దేనిపైన, పనికి రాని గడ్డి లేదా తాటి ఆకులు వేసి కప్పి మీద 4-5 అంగుళాల మందంగా బురద మట్టితో కప్పాలి. క్రమేణా ఇది 2-3 అడుగుల వరకు క్రుంగి పోతుంది. ఈ సమయంలో ఏర్పడే పగుళ్ళను చిక్కటి మట్టి పేడతో కలిపి అలకడం మంచిది.
సైలేజి వాడకం : పాతర వేసిన గడ్డి రెండు నెలలకు మాగి కమ్మటి వాసన గల సైలేజిగా మారుతుంది. తరువాత అవసరాన్ని బట్టి ఎప్పుడైనా తీయవచ్చు. అవసరం లేకుంటే 2 -3 సంవత్సరాల వరకు చెడిపోకుండా సైలేజిని నిల్వ వుంచుకోవచ్చును. అయితే సైలేజి గుంత తెరచిన తరువాత నెల రోజులలో వాడుకోవలసి వుంటుంది. లేకపోతీ ఆరిపోయి చెడిపోతుంది, బూజు పడుతుంది. మొత్తం కప్పునంతా ఒక్కసారి తీయగూడదు. అలవాటు పడేవరకు పశువులు సైలేజిని తినకపోవచ్చు. పాలు పితికిన తరువాత లేదా పాలు పితకడానికి నాలుగు గంటల ముందు సైలేజిని పశువులకు మేపాలి. లేని యెడల పాలకు సైలేజి వాసన వస్తుంది. పాలు పితికే సమయంలో దగ్గరలో సైలేజి లేకుండా చూడాలి.
వరిగడ్డిలో పశువుకు జీర్ణయోగ్యమైన పోషక పదార్ధాలు చాలా తక్కువ. పశువుకు కావలిసిన మాంసకృత్తులు అసలే లేవు. వరిగడ్డిలో పోషక పదార్ధాల లోపమే కాకుండా, పశువు శరీరంలోని కాల్షియం ధాతువును నష్టపరిచే గుణం కూడా వుంది. దీన్ని సుపోషకం చేసుకోవడం ఆవశ్యకత వుంది.
వరిగడ్డిని యూరియా కలిపిని నీళ్ళు చల్లి మాగవేసుకోవడం వల్ల లాభాలు : వరిగడ్డిని యూరియా కలిపిని నీళ్ళు చల్లి ఊరవేసుకొన్నట్లయితే, వరిగడ్డిలోని పీచు పదార్ధము తగ్గి పశువులు ఎక్కువ మేతను తిని జీర్ణం చేసుకోగలవు. ఊరవేసిన గడ్డిలో మాంసకృత్తులు లభించుటయే కాక పశువు ఆరోగ్యముగా వుంటుంది. 
మామూలు వరిగడ్డిలో మాంసకృత్తులు అసలే లేవు. అదే యూరియా కలిపి ఊరవేసిన గడ్డిలో 5 శాతం వరకు మాంసకృత్తులు పెరుగును.
మామూలు గడ్డిలో జీర్ణయోగ్యమైన పోషక పదార్ధాలు 40 శాతంవరకు వుంటే, ఊరవేసిన గడ్డిలోఅవి 60 శాతం వరకు పెరుగును.
మామూలు వరిగడ్డిలో తేమ 5-10 శాతం వరకు ఉండుట వలన పశువులు తక్కువగా మేస్తాయి. ఊరవేసిన గడ్డిలోఅవి 45-55 శాతం వరకు తేమ పెరుగుట వలన పశువులు బాగా తింటాయి. 
యూరియా గడ్డి వలన లభించు మాంసకృత్తులు, తెలకపిండి యితర పశువుల దాణాలకన్నా చౌకగా లభించును. ఊరవేసిన గడ్డి రుచికరంగా మెత్తగా ఉండుటవలన, ఎక్కువగా తిని బాగా జీర్ణము చేసుకొని పశువులు సద్వినియోగము చేసుకోగలవు.
విధానము:
  • ఒక రోజుకు ఒక పశువుకు 6 కేజీల యూరియాతో మాగ వేసిన గడ్డి కావలసి వస్తుంది. ఒక పశువుకు 7-8 రోజులకు 50 కేజీలు కావాలి. ఈ విధంగా పశువులకు కావలసిన ప్రకారము యూరియా మోతాదును నిర్ణయించుకోవాలి.
  • 15 లీటర్ల నీళ్ళు 1 కిలో యూరియా
  • 25 కిలోల వరిగడ్డి
  • ఒక పశువుకు 4-5 రోజులకు సరిపోతుంది
100 కేజీల వరిగడ్డికి 4 కిలోల యూరియా 60 లీటర్ల నీళ్ళు కావాలి. మొట్టమొదట యూరియాను నీళ్ళలో బాగా కరిగేటట్లు కలపాలి. ఆ తర్వాత గడ్డిని నేల మీద పరిచి, యూరియా కరిగిన నీళ్ళను పూర్తిగా గడ్డిపై చల్లాలి. యూరియా నీళ్ళు గడ్డిపై పూర్తిగా కలిసేటట్లు చూడాలి. కలిపినా గడ్డిని మొత్తము వామి వేయాలి. ఈ విధముగా వేసిన గడ్డి వామును గాలి చొరకుండా బాగా అదిమి వారి యెంట్లతో బిగించవలెను. ఇలా వామి వేసిన గడ్డిని పది, పదిహేను రోజుల తర్వాత పశువులకు మేపవచ్చును. ఈ పద్ధతిలో వేసిన వరిగడ్డి వామును 4 -5 నెలల వరకు వాడుకొనవచ్చును. యూరియా కలిపిన వరిగడ్డిని మట్టి గోలాలలో గాని, బస్తాలలోగాని నింపి గాలి చొరకుండా వారం రోజులు మాగనిచ్చి మేపుకోవచ్చు

పునరుత్పత్తిలోమెలకువలు

పాడి పశువు లాభసాటి పునరుత్పత్తి లక్ష్యాలు:
  • పాడి పశువులు సకాలములో ఎదకు వచ్చి చూలు కట్టి ఈనితేనే లాభసాటిగా వుంటుంది.
  • సంకర జాతి పశువులు 15 మాసాలు, గ్రేడేడ్ ముర్రా గేదెలు 2-3 సంవత్సరములు, దేసవాళి గేదెలు ఆవులు 3-4 సంవత్సరముల వయస్సులో మొదటి సారి ఎదకు రావాలి
  • ఆవు అయితే 2-3 సంవత్సరముల లోపు మొదటి ఈత ఈనాలి. గేదె అయితే 3-4 సంవత్సరముల లోపు మొదటి ఈత ఈనాలి. ఈతకు ఈతకు మధ్యకాలం 12-14 మాసాలకు మించకూడదు. 10 సంవత్సరముల వయస్సులో 5-6 ఈతలు ఈనాలి.
  • పాడికాలములో అనగా 10 నెలల లో 1800-2000 లీటర్లకు తక్కువ కాకుండ పాల దిగుబడి ఇవ్వగలగాలి.
ఈ లక్ష్యాలు సాధించాలంటే:
  • ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పశువులను ఒకసారి పరిశీలించి ఎదను గమనించాలి. ఎదకు వచ్చిన తర్వాత సకాలములో గర్భధారణ చేయించాలి. ఒక ఎద తప్పితే, 500 రూ.ల విలువ గల ఉత్పత్తి నష్ట పోవలసి వస్తుంది.
  • మొదటిసారి గర్భధారణ చేసే పశువు బరువు కనీసము 200 కిలోలుండాలి. పశువు యొక్క పొడవు (భుజము నుండి మక్కెల వరకు) దాని భుజము వెనుక శరీరం చుట్టు కొలత (అడుగులో) తో గుణించి బరువును తెలుసుకోవచ్చు.
  • గర్భధారణ జరిగిన 90 రోజుల లోపుల చూడి నిర్ధారణ పరీక్ష చేయించాలి.
  • ఈనిన తర్వాత వచ్చే రెండవ ఎదలో తిరిగి గర్భధారణ చేయించాలి.
పాడి పశువుల పునరుత్పత్తి క్రమము
పునరుత్పత్తిక్రమము
దేశవాళి ఆవు
సంకరజాతి ఆవు
గేదెలు
మొదటి సారి ఎదకు వచ్చే వయస్సు
3-4 సం.లు.
14-18 మాసాలు
3-4 సం.లు
ఎదకు, ఎదకు మధ్యకాలం
21 రోజులు
21 రోజులు
21-23 రోజులు
ఎదకాలం
18-24 గంటలు
18-24 గంటలు
18-36 గంటలు
చూలు కాలం
280 రోజులు
280 రోజులు
310 రోజులు
మొదటి ఈత వయస్సు
4-5 సం.లు.
2-3 సం.లు.
4-5 సం.లు.
ఈతకు ఈతకు మద్య కాలం
2 సం. పైగా
12-14 మాసాలు
16-20 మాసాలు
ఈతలో పాడి కాలం
200 రోజులు
300 రోజులు
250-300 రోజులు
సరాసరి పాల ఉత్పత్తి
1-2 లీటర్లు
8-10 లీటర్లు
6-8 లీటర్లు
మొత్తం మీద దేశవాళిపశువుకన్నాసంకరజాతి పశువు వల్ల 5-6 రెట్లు ఎక్కువ లాభం కలుగుతుంది.
త్వరిత గతిన మన దగ్గర వున్న తక్కువ దిగుబడిని దేశవాళి పశువులను అధిక దిగుబడినిచ్చేసంకర జాతి పశువులుగా వృద్ది చేసుకోవాలంటే కృత్రిమ గర్భధారణ ఏకైక మార్గం
కృత్రిమ గర్భధారణ వల్ల లాభాలు:
  • మేలు జాతి ఆబోతు ప్రపంచంలో ఎక్కడ వున్నా దాని మేలు జాతి గుణాలను ఉపయోగించుకోవచ్చు. దాని వీర్యాన్ని సేకరించి ఘనీభవింపచేసి నిల్వ ఉంచితే ఆబోతు చనిపోయిన తరువాత కూడా 10-15 సం.రాలు దాని మేలు జాతి లక్షణాలు ఉపయోగించుకోవచ్చు.
  • సహజ సంపర్కంలో ఒక ఆబోతు సంవత్సరానికి 100-150 ఆడపశువులకు మాత్రమే గర్భధారణ చేయగలుగుతుంది. అదే కృత్రిమ గర్భధారణ ద్వారా 5-10 వేల పశువులకు ఉపయోగపడుతుంది. ఆబోతుల కొరతను నివారించవచ్చును.
  • రైతులకు విత్తనపు ఆబోతుల పోషణ ఖర్చులు భరించవలసిన అవసరము లేదు.
  • గొడ్డు పోతు సమస్యలను సులభంగా అరికట్టవచ్చు.
పశువులలో పిండం మార్పిడి విధానం
  • మన దేశవాళి పశువులను ఇంకా త్వరిత గతిన అభివృద్ధి పరచి అధిక పాల దిగుబడి కొరకు అత్యాధునికమైన పిండం మార్పిడి విధానం కూడా ఉన్నది.
  • ఒక ఆడపశువు గర్భకోశంలో శాస్త్రీయ పద్దతిలో పిండాన్ని ప్రవేశం పెట్టే విధానాన్ని పిండం మార్పిడి అంటారు. సాధారణంగా ఒక ఆడ పశువు 9-10 మాసాల కొకసారి ఒక దూడ నిస్తుంది. ఈ పద్దతి ద్వారా యిదే సమయంలో పది పిండాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ అధిక పాలసార గల పిండాలను తక్కువ పాలచార గల పశువుల గర్బకోశంలో ప్రవేశ పెట్టి తద్వారా అధిక పాలచార గల పది దూడలను పొందవచ్చు.

Thursday, 25 June 2015

మేపులో మెళకువలు

అధికోత్పత్తి సాధించాలంటే పశువులకు మంచి పోషక విలువలున్న ఆహారం మేపాలి.
  • పాడి పశువుల పోషణ ఖర్చులో 60-70 శాతం మేపు కొరకు ఖర్చవుతుంది.
  • మేపు గురించి శాస్త్రీయ పరిజ్ఞానం వుంటే, అందుబాటులో వున్నా దాణా దినుసులతో సమీకృత దాణా మిశ్రమాన్ని తక్కువ ఖర్చుతో తయారు చేసుకొని లాభదాయకంగా పశువులను పోషించుకోవచ్చు.
  • పశువులకు ప్రతి 100 కిలో గ్రాముల శరీర బరువుకు 2 కిలోల పొడి పోషక పదార్ధములు కావాలి. ప్రతి కిలో పాల ఉత్పత్తికి 50 గ్రాముల జీర్ణయోగ్యమైన మాంసకృత్తులు కావాలి. రోజుకు 7-9 లీటర్ల పాలిచ్చే పశువులు 7 కిలోల జీర్ణయోగ్యమైన పాడిపోషక పదార్ధములు, యిందులో 0.75 కిలోల జీర్ణయోగ్యమైన మాంసకృత్తులు కావాలి.
  • పచ్చిమేత స్వంత భూమిలో సాగు చేసుకొని పాడి పశువులకు మేపుకోవడం లాభదాయకం. పుష్పలంగా పచ్చిమేత మేపగల్గితే మామూలుగా కావలిసిన దాణాలో మూడవ వంతు తగ్గించుకోవచ్చు. 6-7 లీటర్ల పాలిచ్చే పశువులకు 1:3 నిష్పత్తిలో కాయజాతి, ధాన్యపుజాతి పచ్చిమేతలు కలిపి మేపగల్గితే ఎలాంటి దాణా ఖర్చులు లేకుండా పాల ఉత్పత్తిని తీయవచ్చు.
  • పాడి పశువులకు అన్నిటికి ఒకే విధంగా మేపకుండా, వాటి పాల ఉత్పత్తిని అందుకు కావలిసిన పోషక పదార్ధాల అవసరాన్ని దృష్టిలో వుంచుకొని మేపు అందివ్వాలి.
  • పాడి పశువులకు పుష్కలంగా పరిశుభ్రమైన నీరు త్రాగడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. ప్రతి పాడి పశువుకు రోజు 35-45 లీటర్ల నీరు త్రాగడానికి యింతే మోతాదులో దానిని కడగడానికి శుభ్రతకు కావాలి. సుమారు ప్రతి పశువుకు రోజుకు 100 లీటర్ల నీరు కావలసి వస్తుంది.
లభించే దాణా దినుసుల అందుబాటుని బట్టి ఈ క్రింద సూచించిన దాణా మిశ్రమాలలో ఏదైనా తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాలలో ఏదైనా తయారుచేసుకోవచ్చు. ఈ మిశ్రమాలలో 68-70 శాతం జీర్ణయోగ్యమైన పోషక పదార్ధములు మరియు14 నుండి 16 శాతం జీర్ణయోగ్యమైన మాంసకృత్తులు లభించును.
దాణా దినుసులు
1
2
3
4
5
6
1. జొన్నలు, మొక్కజోన్నవంటి ధాన్యము
30
20
20
30
40
30
2. గోధుమ పొట్టు, తవుడు
32
50
40
50
10
3. గానుగపిండి
25
20
20
20
20
25
4. శనగ పొట్టు లేదా పెసర, మినుప పొట్టు
-
-
20
-
30
25
5. ప్రత్తి గింజల చెక్క
-
-
-
-
-
20
6. బెల్లపు మడ్డి
10
7
-
-
-
-
7. లవణ మిశ్రమాలు
3
3
3
3
3
3

మేపు మోతాదు నిర్ణయించడంలో సాధారణ సూత్రాలు
  1. పాడి పశువులు ఎండుమేత పచ్చిమేత కలిపిమేపేటప్పుడు ప్రతి 100 కిలోల శరీర బరువుకు 1 కిలో ఎండుమేత, 4-5 కిలోల పచ్చిమేత మేపవచ్చు. ఎండు గడ్డి, పచ్చి గడ్డి కలిపిమేపితే రోజుకు ఒక పశువుకు 5-6 కిలోల ఎండు గడ్డి 15 కిలోల పచ్చిమేత కావాలి.
  2. దాణా మోతాదును పశువు పాల ఉత్పత్తిని బట్టి యివ్వాలి. అది యిచ్చు పాలలో రెండు కిలోల పాల తర్వాత అదనంగా యిచ్చే ప్రతి 3 లీటర్ల పాలకు, గేదెలకు ప్రతి 2.5 లీటర్ల పాలకు ఒక కిలో చొప్పున దాణా యివ్వాలి. దాణా రెండు సమాన భాగాలు చేసి ఉదయం, సాయంత్రం, పాలు పితికే ముందు మేపాలి.
  3. పాడి పశువులకు యివ్వవలసిన పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా మోతాదుల పట్టిక
  4. పశువుల పాల ఉత్పత్తి
    పచ్చిమేత
    (కిలోలు)
    ఎండు మేత (కిలోలు)
    దాణా (కిలోలలో)
    గేదెకు
    ఆవుకు
    పుష్కలంగా పచ్చిమేత లభించే సమయంలో
    5 కిలోల వరకు
    30
    4
    -
    -
    5-8 కిలోల వరకు
    30
    4
    1.5
    1.0
    8-11 కిలోల వరకు
    30
    4
    2.00
    1.5
    11-15 కిలోల వరకు
    30
    4
    3.00
    2.5
    పచ్చిమేత కొరత సమయంలో
    5 కిలోల వరకు
    4
    8
    2.0
    1.5
    5-8 కిలోల వరకు.....
    4
    8
    3.0
    2.5
    8-11 కిలోల వరకు...
    4
    8
    4.5
    3.0
    11-15 కిలోల వరకు..
    4
    8
    5.0
    3.5

పశువులలో ప్రధమ చికిత్స

పశువులకు గాయాలు కలగడం, కొమ్మలు విరగడం సర్వ సాధారణం. అంతేకాకుండా సామాన్యంగా మేత ఎక్కువగా తిన్నప్పుడు, కుప్ప నూర్పుడు చేసేటప్పుడు గింజలు తినడం వల్ల కడుపు కుట్టు, కడుపు ఉబ్బడం జరుగుతుంది. ఈ వ్యాధులకు వెంటనే చికిత్స చేయించడం మంచిది లేదా ప్రమాదం. మనకు పశువైద్యం అందుబాటులో లేనప్పుడు మరింకే పరిస్థితులలో వైద్య సహాయం అందలేని స్థితిలో వ్యాధి తీవ్రతరం కాకుండా కొన్ని ప్రధమ చికిత్స చర్యలు పాటించాలి.
గాయాలు
  1. గాయాలను పొటాషియం పర్మంగానేటు కాని, ఫినాయల్ ద్రావకంతో కాని, శుభ్రం చేయాలి. మరగబెట్టి ఉప్పు నీటితో చీము పట్టిన పుండ్లను శుభ్రం చేయవచ్చు.
  2. రక్తం కారుతున్నప్పుడు గాయానికి పైగా బిగ్గరగా కట్టుకడితే రక్తం ఆగుతుంది. శుభ్రమైన దూది అందులో దూర్చి రక్తం కారకుండా చూడాలి. కొంచెం సల్ఫనిలమైడ్ పౌడరు వేసి కట్టుకట్టాలి.
  3. పురుగులు పట్టిన గాయాలకు పురుగులు తీసివేసి కర్పూర తైలం పోయాలి. లేదా సీతాఫలము ఆకు, పసుపు నూరి పురుగుపట్టిన పుండ్లకు రాసినట్లైతే పురుగులు చనిపోయి త్వరగా మానును. ఈగలు వ్రాలకుండ వేపనూనె రాయాలి.

కాడి పుండు
బండ్లు, నాగలి లాగే పశువులలో సరియైన జోడు లేకపోయినప్పుడు, రాపిడి వల్ల కాడి పుండు కలుగుతుంది.
  1. కాడి మోపిన చోట వెంట్రుకలు రాలిపోయి, కమిలి నొప్పి పెడుతుంది. ఈ ప్రదేశంలో రోజు కొంతసేపు చల్లనీటి ధారపోయాలి.
  2. కొబ్బరి నూనెలో హారతి కర్పూరం కలిపి దాని మీద పోయాలి.
  3. కమిలిన భాగం పెద్దగా వాచినట్లైతే అయోడిన్ ఆయింటుమెంటు పూయాలి. లేదా ఆవపిండి పలస్త్రీని వాపుమీద వేయాలి. అది పగిలి కారుతుంది. తరువాత మాములుగా గాయాలకు చేసినట్లు చికిత్స చేయాలి. వాపు తగ్గే వరకు పని చేయించకూడదు.
కొమ్ములు విరగడం
  1. వ్రేలాడుతున్న కొమ్మును కోసివేయాలి.
  2. రక్తం కారకుండా తెల్లని గుడ్డను తడిపి గట్టిగా కట్టుకట్టాలి. కట్టు కట్టక ముందు గాయం మీద కొంచెం పాటిక పొడి చల్లాలి.
  3. కొమ్ము తుడుగు ఊడితే తెల్లని గుడ్డ పీలికలు, తడిపి మందంగా గట్టిగా కట్టు కట్టాలి. కట్టు మీద పటిక నీరు పోయాలి. తర్వాత డాక్టరుతో చికిత్స చేయించుకోవాలి.
బెణుకులు
  1. బెణికినచోట వేడినీళ్ళతో రోజుకు రెండు మూడు సార్లు కాపాలి.
  2. ఆ తర్వాత నూనెలో హారతి కర్పూరము కలిపి మర్దన చేయాలి. చింతాకు కషాయంతో కూడా కాపవచ్చు.
  3. కట్టుకట్టుటకు వీలుగా వుంటే చింతాకు నూరి కట్టుకట్టాలి. బెణుకు పాతబడితే ఆవపిండి జిగురు పూయవచ్చు, పని మాన్పించాలి.
కీళ్ళు తొలగుట
  1. కీలు తొలగిన వైపు కాక రెండవ వైపు పశువును పడవేసి, కీలు తొలగిన వైపుకు తాడుకట్టి జాగ్రత్తగా లాగుతూ, మరొకరు అరచేతిలో తొలగిన కీలును యధాస్థానమందు పడేటట్లు చూడాలి.
  2. కీలు సర్దుకున్న తర్వాత మూడు భాగాలు ఆవపిండి ఒక భాగం కారంపొడి కలిపి నూరి బాగా ఎర్రబడేటట్లు రుద్దాలి. పశువులకు విశ్రాంతి నివ్వాలి. యింకా నయం కాకపోతే డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలి.
కడుపు కుట్టు
పశువులు మేత బాగా తిని తగినన్ని నీరు త్రాగకపోవడంవల్ల లేదా గింజలు ఎక్కువగా తినడంవల్ల జీర్ణకోశం సరిగా పని చేయక కడుపు కుట్టు వస్తుంది.
పశువు నెమరు వేయటం మానుకుంటుంది. పేడ పెంటికలుగా వేస్తుంది. పశువులు మందకొడిగా వుంటాయి. ఎడమ డొక్కలో సొట్టపడుతుంది. కడుపునొప్పితో బాధపడతాయి.
  1. రెండు లీటర్ల నీళ్ళలో 50 గ్రాములు ఉప్పు 50 గ్రాములు సొంఠి పొడి కలిపి త్రాగించాలి.
  2. ఒక రోజులో తగ్గకపోతే పావుశేరు ఆముదము పట్టించాలి. దాణా పెట్టకూడదు.
  3. కొంచెం నెమరు వేసి పేడవేయగానే 20 గ్రాములు ముష్టి గింజలపొడి 30 గ్రాములు సొంటిపొడి 20 గ్రాముల సోడా ఉప్పు బెల్లంలో కలిపి 3 - 4 రోజులు వరుసగా తినిపించాలి. కడుపు కుట్టు రెండు రోజులలో నయం కానట్లయితే డాక్టరు గారిచే వైద్యం చేయించాలి.
కడుపు ఉబ్బు
  1. 50 గ్రాముల కర్పూర తైలము అర్ధ లీటరు నూనెలో కలిపి త్రాగించాలి.
  2. ఇంకా తగ్గకపోతే 25 గ్రాముల మిరియాపొడి 25 గ్రాముల సొంఠి పొడి 150 గ్రాముల నాటుసారా, 1 లీటరు నీళ్ళలో కలిపి త్రాగించాలి.
  3. కడుపు ఉబ్బు తగ్గే వరకు మేత వేయకూడదు. జావగాని, గంజికాని త్రాగించాలి.
  4. ఆ తర్వాత 20 గ్రాముల సో౦పు పొడి 20 గ్రాముల సొంఠి పొడి 20 గ్రాముల ముష్టి విత్తుల పొడి 20 గ్రాముల వాముపొడి 40 గ్రాముల సోడా ఉప్పు బెల్లంలో కలిపి ముద్ద చేసి తినిపించాలి.
సామాన్య పారుడు
  1. ఆ తర్వాత 20 గ్రాముల కాచు 20 గ్రాముల సీమ సున్నము 20 గ్రాముల సొంఠి పొడి జావలో కలిపి త్రాగించాలి. ఇంకా పారుడు కట్టకపోతే డాక్టరు చేత వైద్యం చేయించాలి.

Friday, 19 June 2015

GONTHU VAPU VYADHI (HARMORRHAGIC SEPTICEMIA)గొంతు వాపు వ్యాధి

గొంతు వాపు వ్యాధి

 పశువులకు సోకే వ్యాధుల్లో గొంతువాపు ప్రమాదకరమైంది. ఈ వ్యాధిని గురకవ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మ జీవుల వలన సంక్రమిస్తుంది. కలుషితమైన నీరు, మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడుతాయి. వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా దున్నలు , గేదేలలో వస్తుంది . నీరసంగా వున్నా పశువులకు ఈ వ్యాది త్వరగా సోకుతుంది . పల్లపు ప్రాంతాలలో , వర్షపు నీరు నిలిచే ప్రాంతాలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది ఇది అంటువ్యాధిగా ఇతర పశువులకు సోకుతుంది. ఈ వ్యాధి పాడి పశువులకు సోకితే రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ వ్యాధి పాశ్చరెల్లా మల్లోసిడా అనే సూక్ష్మజీవి వలన వస్తుంది. ఈ సూక్ష్మజీవి ప్రధానంగా ఉష్ణ దేశాల్లో వ్యాపించి ఉంటుంది. రాష్ట్రంలో ఈ సూక్ష్మజీవి వ్యాప్తి చెందేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున తగు జాగురుకతతో వ్యవహరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని పాడి గేదెలు, ఆవులకు ఈ వ్యాధి బారినట్టు చెబుతున్నారు. ఎనిమిది నెలల నుంచి రెండేళ్లలోపు ఉన్న పశువులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వ్యాధి వ్యాప్తి
గొంతువాపు వ్యాధి బారిన పశువులను మిగతా పశువులతో కలిపి ఉంచితే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఒకే పాకలో ఉంచకుండా వాటిని వేరు చేయాలి. వ్యాధి సోకిన పశువు తిన్న గడ్డిని ఆరోగ్యకరమైన పశువు తినడం వలన కూడా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన పశువు నోటి నుంచి కారే చొంగ ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి పశువులను రవాణా చేసేటప్పుడు వ్యాధి సోకుతుంది


వ్యాధి లక్షణాలు
వ్యాధికారక సూక్ష్మజీవులు పశువుల శరీరంలోనికి ప్రవేశించిన రెండు నుంచి ఐదు రోజుల లోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
ü -జ్వర తీవ్రత 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది.
ü -చర్మం వదులుగా ఉన్న చోట ద్రవం చేరి గొంతు భాగం ఉబ్బి ఉంటుంది. చేతితో గట్టిగా వత్తితే గుంట మాదిరిగా ఏర్పడుతుంది.
ü -కళ్ల నుంచి నీరు, ముక్కు నుంచి ద్రవం కారుతుంది.
ü -పశువులకు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
ü -ముక్కు నుంచి రక్త పూరితమైన ద్రవాలు కారుతూ ఉంటాయి.
ü -ఊపిరితిత్తులు, శ్వాసవాహికల్లో పుండ్లు ఏర్పడి చీము చేరుతుంది. విపరీతంగా దగ్గు వస్తుంది.
ü పశువు ఆయాస పడుతూ శ్వాస పీలుస్తుంది. గుర్రు గుర్రుమని శబ్దం వస్తుం ది.
ü శ్వాస మరీ కష్టమై నాలుక బయటికి తీస్తుంది.
ü ఒక్కోసారి వ్యాధి సోకిన పశువులు లక్షణాలు కన్పించిన 24 గంటలలోపు మృత్యువాత పడే అవకాశం ఉంటుంది.
నివారణ చర్యలు
ప్రయోగశాలలో రక్త పరీక్ష చేయించి బైపోలార్ గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియాను గుర్తించడం వలన వ్యాధిని నిర్ధారిస్తారు. పశువు చనిపోయిన తరువాత శవ పరీక్ష చేసి కూడా వ్యాధిని నిర్ధారించవచ్చు.
-30 మిల్లీ లీటర్ల సల్ఫాడిమిడిన్ మందును 3 రోజుల పాటు రక్తంలోకి ఎక్కించాలి. చర్మం కింద కండకు కూడా మందును ఇంజక్షన్ రూపంలో ఇవ్వొచ్చు.
-క్లోరం ఫెనికాల్, ఆక్సిటెట్రాసైక్లిన్, సెఫట్రైఆక్సోమ్, సల్ఫా మందులను15 మిల్లీ లీటర్ల మోతాదులో ఇంజక్షన్ల రూపంలో ఐదు రోజుల వరకు పశువు కండకు ఇవ్వాలి.
-వాపు తగ్గడానికి కార్టిబోస్, జోబిడ్ వంటి మందులను 10 నుంచి15 మిల్లీ లీటర్ల మోతాదులో 3 రోజుల పాటు కండకు ఇవ్వాలి.
జాగ్రత్తలు...
వ్యాధి ఒక పశువు నుంచి మరోక పశువుకు సోకుతుంది. కాబట్టి వ్యాధి ప్రబలినటువంటి ప్రదేశాల్లో పశువులను కొనుగోలు చేయకూడదు. వ్యాధి రాకుండా పశువులకు ముందు జాగ్రత్త చర్యగా గొంతువాపు టీకాను 5 నెలల వయస్సు పై బడి ఉన్న దూడలతో సహా అన్ని పశువులకు 3 నుంచి 5 మిల్లీ లీటర్ల మోతాదులో చర్మం కింద వేయించాలి. ఈ టీకాను ప్రతి సంవత్సరం జూన్, జులై మాసాల్లో తప్పకుండా వేయించాలి.
-వ్యాధిగ్రస్త పశువును వెంటనే గుర్తించి మంద నుంచి వేరు చేయాలి.
- పశువుల పాకలను ఫినాయిల్తో కడిగి పరిశుభ్రంగా ఉంచాలి.
-చనిపోయినటువంటి పశువులను గ్రామానికి దూరంగా గుంట తీసి పొడిసున్నం చల్లి పూడ్చిపెట్టాలి.
-పశువులకు అందించే దాణాలోఆక్సీటెట్రాసైక్లిన్ వంటి పొడి మందులను కలిపి పెట్టాలి.
-పశువులను ఒక చోట నుంచి మరొక చోటికి రవాణా చేసేటప్పుడు మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి నివ్వాలి

ప్రారంభ దశలోనే అరికట్టాలి వ్యాదిని ఎలా నివారించాలి ?

వర్షాకాలం ముందు జూన్ , జులై మాసాలలో  పశు సంవర్ధక శాఖ ప్రభుత్వము వారు ఉచితంగా అందించే వ్యాది నిరోధక టీకాలు వేయించాలి. ఆ తర్వాత  ఏటా వ్యాధి నివారణ కోసం టీ కాలు వేయిస్తూ ఉండాలి.