Thursday, 14 July 2016
Saturday, 2 July 2016
Thursday, 30 June 2016
Friday, 10 June 2016
వర్షాకాలములో పశువులకు మరియు గొర్రెలకు వచ్చే వ్యాధులు
కాలం, వాతావరణాన్ని బట్టి మానవుల మాదిరిగానే పశువుల్లోనూ వ్యాధులు వస్తుంటాయి. సీజనల్ వ్యాధులపై జాగ్రత్త వహించాలి. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు, ఇతర వ్యాధుల బారి నుంచి వాటిని కాపాడుకోవాలి. వర్షాకాలంలో పరిసరాల ప్రభావం, వరద నీళ్లు, మెలిచిన పచ్చిక గడ్డిపైన ఉండే కీటకాలు, అటువంటి మేత తినడం వల్ల గేదెలు, మేకలు, గొర్రెలు, రకరకాల పశువులకు పలురకాల వ్యాధులు సోకి అనారోగ్యానికి గురవుతాయి. దీని వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అంటువ్యాధుల బారిన పడి చివరకు చనిపోయే ప్రమాదం ఉంటుంది.
1)గొంతు వాపు వ్యాధి :
వర్షాకాలంలో పశువులకు ప్రధానంగా వచ్చేది గొంతువాపు వ్యాధి. దీనిని గురకవ్యాధి అంటారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మ జీవుల వలన సంక్రమిస్తుంది. ఇది అంటువ్యాధిగా ఇతర పశువులకు సోకుతుంది. కలుషితమైన నీరు, మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడుతాయి. కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తూ, గురక, శ్వాస పీల్చడం కష్టమవుతుంది. పశువు ఆయాస పడుతూ శ్వాస పీలుస్తుంది. గుర్రు గుర్రుమని శబ్దం వస్తుంది. జ్వర తీవ్రత 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. గొంతు కిందకు నీరు దిగి గొంతువాపు వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన పశువు 24 గంటల్లో మరణించే అవకాశాలు ఉంటాయి
నివారణ : వర్షాకాలం ముందు జూన్, జూలైలో వ్యాధి నిరోధక టీకాలు చేయించాలి. వ్యాధి ఉన్న పశువుల దొడ్డిని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన పశువును వెంటనే మంద నుంచి వేరు చేయాలి. వ్యాధి సోకిన పశువుకు వ్యాధి తీవ్రతను బట్టి సల్ఫాడిమిడిన్, ఇంటాసెఫ్‌టాజు, ఎక్సెప్ట్ వంటి ఇంజక్షన్లు ఇవ్వాలి.. ఇతర పశువులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమీప పశువుల వైద్యాధికారిని సంప్రదించాలి.
2)గాలికుంటు వ్యాధి/ నంజు జ్వరము:
ఇది వైరస్ సోకడం లేదా కలుషితమైన గాలి ద్వారా వస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది వర్షాకాలంలో విరివిగా గేదె, ఎద్దు, ఆవులకు వచ్చే గాలికుంటువ్యాధి సోకుతుంది. గిట్టలు ఉన్న ప్రతి జీవికి ఈ అంటువ్యాధి వస్తుంది. వ్యాధి సోకిన సమయంలో పశువుకు 104 నుండి 105 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. నోటిలో, గిట్ల మధ్య పుండ్లు పడి పశువులు నడవలేని స్థితికి చేరతాయి. ఎక్కువగా మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఈ వ్యాధి పశువులకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన పశువుకు నోటి గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారుతాయి. చర్మం గరుకుగా మారుతుంది. నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం చేత పశువులు మేత, తీసుకోక నీరసించి పోతాయి. ప్రధానంగా వర్షాకాలంలో నేలలు చిత్తడిగా ఉండటంవల్ల గాలికుంటు వ్యాధి వస్తుంది. ఈ వ్యాధివల్ల చూడిగేదెలు ఈసుకుపోతాయి. పాడిగేదెలకు పాల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఎద్దుల్లో అయితే రోగ నిరోధకశక్తి తగ్గిపోయి తొందరగా అలసటకు గురై నీరసించిపోతాయి, రొప్పుతాయి. ఈవ్యాధి నివారణ కోసం ప్రారంభించిన పైలెట్ ప్రాజెక్టు పధకం ద్వారా ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిది పర్యాయాలు ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తుంది. ఈ టీకాల వల్ల పశువులు రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి.
చికిత్స
వ్యాధి సోకిన పశువును మంద నుంచి వేరు చేయాలి. నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిసరిన్ కలిపి పూయాలి. గిట్టల మధ్య పుండ్లకు పరమాంగనెట్ ద్రావణంతో శుభ్రం చేసి వేపనూనె రాయాలి. యాంటిబయోటిక్స్, పెయిన్‌కిల్లర్స్ వాడితే ఉపశమనం కలుగుతుంది. బిస్ప్రేపెన్ 2.5గా, ఎన్రోప్లాక్సిన్ 50 ఎంఎల్, సెఫ్ట్రిక్సిన్ 3 గ్రా, మెలోనెక్స్ 30 యం.యల్, నిమోవెట్ 50 యంయల్ వాడితేపశువులు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాయి.
3)జబ్బవాపు:
ఈ వ్యాధి క్లాస్ట్రిడియం చొవై అనే బ్యాక్టిరియా ద్వారా పశువులకు సోకుతుంది. ఆరు మాసాల నుంచి రెండేళ్ల లోపు వయసున్న పశువులకు ఎక్కువ సోకుతుంది. ఈ వయసులో పశువుకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. భుజం, తొడ ప్రాంతాల్లోని కండరాలను ఆశించి, మాంసం కుళ్లిపోయేలా చేస్తుంది. వాపుతో పశువులు కుంటుతాయి. వెనక కాలు కాని ముందు కాలు గాని పైకి లేపి ఉంచి కుంటడం చేస్తాయి. వాపు దగ్గర కరకరమని శబ్దం వస్తుంది.
చికిత్స..
వ్యాధి ప్రారంభంలోనే పెన్సిలిన్ వంటి యాంటిబయాటిక్స్ వాడాలి. వ్యాధిగ్రస్థ పశువుల్ని వేరుచేయాలి, చనిపోయిన పశువును ఉన్నట్లయితే గొయ్యిలో పాతిపెట్టాలి. వ్యాధి రాకుండా వర్షాకాలం ముందే ప్రభుత్వం అందించే జబ్బవాపు వ్యాధి టీకాలు వేయించాలి.
గొర్రెలలో వర్షాకాలములో వచ్చే వ్యాధులు- వాటి నివారణ చర్యలు
1)గొర్రెలలో నీలినాలుక వ్యాధి :
దోమకాటు, వైరస్ వల్ల గొర్రెలు, మేకలకు ఈవ్యాధి వర్షాకాలంలో విరివిగా వస్తుంది. 105 నుండి 106 వరకు ఉష్ణోగ్రత ఉండి, నోటిలో పుండు ఉండి సొంగ కారుతుంది. దీనినే మూతివాపు వ్యాధి అని కూడా అంటారు. నాలుక చివరలో నీలిరంగు వస్తుంది. కాళ్ల గిట్టలు చుట్టూవాచి పుండ్లు అవుతాయి. ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించి వారం రోజులలో చనిపోతాయి.
నివారణ : వ్యాధి సోకిన గొర్రెలను సకాలంలో గుర్తించి వైద్యులతో చికిత్స చేయించాలి. నోటిపుండ్లను ఒక శాతం బోరిక్ యాసిడ్ లోషన్‌తో శుభ్రం చేయాలి. రెండు శాతం బొరిగ్లిసరిన్ పూయాలి. గొర్రెలు ఆకలితో చనిపోకుండా ఉండేందుకు జావలాంటిది అందించాలి. వైద్యుల సలహాతో యాంటిబయోటెక్ ఇంజక్షన్ ఇప్పించాలి. మేత తీసుకోదు కాబట్టి రాగిజావ, అంబలి జావను ద్రవరూపంలో త్రాగించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, ఎండిన వేప ఆకులను తగలబెడితే కొంతమేర దోమల బారినుండి రక్షించుకోవచ్చు.
పశువుల శరీరాన్ని, పరిసరాల శుభ్రతను పాటించాలి. లేకుంటే బాహ్యపరాన్న జీవుల నుంచి వ్యాధులు వస్తాయి. జోరీగలు, పిడుదులు, గోమార్ల వంటి బాహ్య పరాన్నజీవుల వల్ల వచ్చే రోగాల వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుంది.
2)గొర్రెల్లో కాలిపుండు వ్యాధి:
ప్రధానంగా వర్షాకారంలో నేలలు చిత్తడిగా ఉండటం వల్ల ప్లాస్పియం గ్రూపు బాక్టీరియా వృద్ధిచెంది గిట్టలు మధ్య పుండ్లు ఏర్పడతాయి. బురదలో తిరిగినప్పుడు గిట్టల మధ్య చర్మం మెత్తబడి, వాచి చిట్లిపోతుంది. చీము పట్టి నొప్పితో ముందు కాళ్లపై గెంటుతుంటాయి. వ్యాధి మరింత జటిలం అయితే గిట్టలూడి పోతాయి. ఈ వ్యాధి సోకిన పశువులకు 10 శాతం మైలతుత్తం, పది శాతం జింక్‌సల్ఫేట్, లేదా ఐదు శాతం ఫార్మలిన్లో ఏదైనా ఒక ఆయింట్మెంట్ పూయాలి. యాంటిబయాటిక్ ఇంజక్షన్లు వరుసగా 3-5 రోజులు వేయించాలి. అవి తిరిగే ప్రదేశాలలో ఒక శాతము ఫార్మలిన్ ను వాడితే పురుగు చనిపోవును. గట్టి నేలల్లో మేపే విధంగా చూడాలి.
3)గొర్రెల చిటుకు వ్యాధి:
చిటుకు రోగం క్లాస్ట్రీడియమ్‌వెల్షీ అనే బ్యాక్టీరియాతో తొలకరి వర్షాల తర్వాత పెరిగి వాడుపడిన గడ్డిని తినడంతో తరచూ జీవాలకు ఈ వ్యాధి జూన్ నుంచి జులై మధ్యలో ఎక్కువగా సంక్రమిస్తుంది. మందలో బలిష్టంగా ఉన్న గొర్రెలు, మేకలు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండానే అకస్మాత్తుగా మరణిస్తాయి. గొర్రె, మేక పిల్లలు రాత్రి బాగానే ఉండి ఉదయం చూసే సరికి మృత్యువాత పడతాయి జీవాలు చనిపోయే ముందు నీరసంగా ఉండి అతి ఉద్రిక్తం చూపడం, నోటి నుంచి నురగలు కక్కుతుండటం, తూలుతూ నడవడం, పళ్లు కొరుకుతూ కనుగుడ్లు తిప్పుతూ గాలిలో ఎగిరి కింద పడి చనిపోతాయి. ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉదయం, మధ్యాహ్నం వేళల్లో కనిపిస్తాయి. ఈ వ్యాధి విషయంలో చికిత్స చేయించినా లాభం ఉండదు. చికిత్స కన్నా వ్యాధి నివారణే అతి ముఖ్యమైనది. ముందస్తుగా టీకా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. చాలా మంది తాపుడు మందు ఉంటుందని మందుల షాపుల నిర్వాహకులు ఇచ్చే దాన్ని తీసుకుని తాపిస్తుంటారు. ఇది అపోహ మాత్రమే. చిటుకు రోగం వస్తే కొద్ది గంటల్లోనే మృత్యువాత పడాల్సిందే. అవసరాన్ని బట్టి స్థానిక పశువైద్యుడి పర్యవేక్షణలో యాంటీబయాటిక్ మందులు, ఇంజక్షన్ల రూపంలో కాని లేదా నీటిలో కలిపి వాడితే వ్యాధిని తట్టుకున్న జీవాలు మాత్రమే కొన్ని సందర్భాల్లో చాలా అరుదుగా తేరుకునే అవకాశం ఉంది. వర్షాకాలంలో కంటే ముందే ఏప్రిల్, మే మాసాల్లో మందలోని అన్ని జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించి ఈ వ్యాధి బారిన పడకుండా నివారించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి, ఇప్పటి వరకు టీకాలు వేయించని వారు తమ జీవాలకు వేయించుకుంటే మంచిది.
వర్షాకాలములో గోమార్లు,పిడుదులు, జోరీగల ద్వార పశువులకు వచ్చే వ్యాధులు
1)తిరుగుడు రోగం: ఈ వ్యాధిని సర్రా/ట్రిపనోసోమియాసిస్ అంటారు. రక్తంలో ఉండే ట్రిపనోసోమా పరాన్నజీవుల వల్ల సంక్రమిస్తుంది. బర్రెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, కుక్కలలో ఎక్కువగా సోకుతుంది. జోరీగల వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. వ్యాధి సోకిన పశువును జోరీగలు కుట్టి, మళ్లీ ఆరోగ్యకరమైన పశువును కుట్టినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వర్షాకాలంలో ఎక్కువగా సోకుతుంది.
లక్షణాలు: వ్యాధి సోకిన పశువులకు జ్వరం వస్తుంది. పశువులు బలహీనంగా ఉండి, వెర్రిచూపులు చూస్తాయి. పండ్లు కొరుకుతూ గుండ్రంగా తిరుగుతాయి. వణుకుతుంటాయి, కళ్లు ఎర్రబారి చూపు మందగిస్తుంది. చూపు పూర్తిగా పోవచ్చు. ఫిట్స్ కూడా రావచ్చు. కొన్ని పశువుల్లో పొట్టకింద, దవడ కింద నీరు చేరి వాపు వస్తుంది. తరచుగా మూత్రవిసర్జన చేస్తాయి. పాల ఉత్పత్తి తగ్గుతుంది. చికిత్స కోసం బెరేనిల్, త్రిక్విన్ వంటి మందులను, రక్త హీనత నివారణకు ఫేరిటాస్ ను వాడాలి.
2) థైలేరియాసిస్ : ఈ వ్యాధి అధిక పాల దిగుబడినిచ్చే సంకర జాతి ఆవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గొర్రెలు, మేకలకు రావచ్చు. వేసవి, వర్షాకాలంలో రావడానికి అవకాశాలున్నాయి.
లక్షణాలు: తీవ్ర జ్వరం. ముక్కు నుంచి నురగ కారుతుంది. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతాయి. తరుచుగా దగ్గుతుంటాయి. కళ్లు ఎర్రబారుతాయి. మేత తినవు, నెమరు వేయవు. పశువులు గోడకు తలను ఆనించి ఉంటాయి. చూడి ఆవులు ఈడ్సుకపోతాయి. రక్తం, బంక విరేచనాలు అవుతాయి. పాల ఉత్పత్తి తగ్గుతుంది. కండరాల వణుకు మరియు లింఫు గ్రంధుల వాపు ఉంటుంది. టెట్రాసైక్లిన్,ప్రోజోమిన్,నివాక్విన్ మందులతో పాటు ఐరన్ ఇంజక్షన్లు వాడాలి. లేదంటే బుటాలేక్స్, జుబయోన్ ను ఒక మిల్లిల మందును ఇరవై కేజీల బరువునకు వాడాలి.
3)బేబిసియోసిస్: ఈ వ్యాధి ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెలు వంటి అన్ని పశువుల్లో వస్తుంది. బేబిసియాసిస్ పరాన్నజీవులు గోమార్లు, పిడుదుల వల్ల వ్యాప్తి చెందుతాయి. దేశీయ పశువుల్లో కంటే సంకర జాతి పశువుల్లోనే ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది. 6 నుంచి 12 నెలల వయసున్న పశువులు ఎక్కువగా ఈ వ్యాధి బారినపడుతాయి. ఈ పరాన్నజీవులు రక్తకణాల్లో ఆవాసం ఏర్పరుచుకుంటాయి. దీంతో రక్త కణాలు పగిలి మృత్యువాతకు గురవుతాయి. రక్త కణాల సంఖ్యతో పాటు హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. ఇది సోకిన పశువుల మూత్రం కాఫీ, ఎరుపు రంగులో ఉంటుంది.
లక్షణాలు: వ్యాధి సోకిన పశువులు తీవ్ర జ్వరం తో బాధపడుతాయి. రక్త కణాల సంఖ్య తగ్గడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. తిండి తినవు, నెమరు వేయకుండా ఉంటాయి. పాల ఉత్పత్తి తగ్గుతుంది. కొన్ని పశులకు కామెర్లు వస్తాయి. వణుకుతూ సరిగ్గా నిలబడలేవు. చికిత్స కోసము బెరేనిల్ మందులను వాడవచ్చును.
పైన తెలిపిన వ్యాధులకు నివారణ అనేది చాలా ముఖ్యమయినది. వ్యాధి సోకిన పశువులను మందనుంచి వేరుచేయాలి. జోరీగలు, పిడుదుల నివారణకు చర్యలు తీసుకోవాలి. పశువుల కొట్టంలో పురుగుల మందులు కొట్టాలి. బ్యూటాక్స్ వంటి మందులను పశువుల చర్మంపై పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన 24 గంటల వరకు పశువులను కడగకుంటే పశువులు వాటి శరీరాన్ని నాకకుండా చూసుకోవాలి. పశువుల పాకలో మురుగు, తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే వేప లేదా జామాయిల్ పొగ నూ సాయంత్రపు వేళల్లో పెట్టినట్లయితే కొంతమేరకు కీటకాలను నివారించవచ్చును.
డాక్టర్.జి.రాంబాబు , పశు వైద్యాధికారి, కడప.
Tuesday, 7 June 2016
Friday, 3 June 2016
Tuesday, 31 May 2016
Wednesday, 18 May 2016
Saturday, 30 April 2016
Subscribe to:
Posts (Atom)